హైదరాబాద్: కేబినెట్‌లో తెలంగాణ నోట్ ఆమోదం పొందడంపై సీమాంధ్ర ప్రాంతం భగ్గుమంది. సమైక్యవాదులు ఎక్కడికక్కడ పదమూడు జిల్లాల్లో నిరసనలు తెలుపుతున్నారు. దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. కాంగ్రెసు పార్టీ కార్యాలయాల పైన దాడులు చేశారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిరసనలకు తోడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో 72 గంటల బందుకు పిలుపునివ్వడంతో మరింత హీటెక్కింది.
కడపలో రైల్వే స్టేషన్ పైన సమైక్యవాదులు దాడి చేశారు. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణకు చెందిన ఆస్తుల పైన సమైక్యవాదులు దాడి చేశారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో అంతటా రోడ్లను దిగ్భందం చేశారు. ఎంపీలు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి.
టి నోట్ పైన ఊరూరా వాడవాడా వందల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. దుకాణాలు మూయించారు. రోడ్లు దిగ్బంధించారు. అడుగడుగునా టైర్లు వేసి తగులబెట్టారు. సోనియా, దిగ్విజయ్, చిరంజీవి, చంద్రబాబు, ఆంటోని దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీతానగరంలో రాష్ట్ర విభజన వార్తలను చూడలేక టీవీలను పగులగొట్టారు.
గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాజమండ్రిలో నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దహనం చేసే ప్రయత్నం చేశారు. కార్యాలయంలోకి కిరోసిన్‌తో సీసాలు విసిరి నిప్పు పెట్టారు. అంతకు ముందు విశాఖపట్నం మధురవాడలో రాజీవ్‌గాంధీ విగ్రహాలను గురువారం తెల్లవారుజామున ఎవరో ధ్వంసం చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు వర్సెస్ టిడిపి
అనంతపురం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ మధ్య ఉద్రిక్తత తలెత్తింది. పట్టణంలోని సప్తగిరి కూడలిలో టిడిపి ర్యాలీని జగన్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టిడిపి ఎమ్మెల్యే, కార్యకర్తల పైన కుర్చీలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో టిడిపి ప్రతిదాడికి దిగింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.
0 comments