SPYder Movie Review


సినిమా : స్పైడర్
నటీనటులు : మహేష్‌బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, ప్రియదర్శి, తదితరులు
దర్శకత్వం : ఏఆర్ మురుగదాస్
నిర్మాతలు : ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు
సంగీతం : హరీస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ : సంతోష్ శివన్
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : ఎన్వీఆర్ సినిమా
రిలీజ్ డేట్ : 27-09-2017

మహేష్‌బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందించిన లేటెస్ట్ క్రేజీ మూవీ ‘స్పైడర్’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా, ఎస్‌జే సూర్య విలన్‌గా నటించిన ఈ చిత్రం.. టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గరనుంచి అంచనాలు పెంచుకుంటూ వస్తోంది. ఇక టీజర్, ట్రైలర్లతో విపరీతమైన క్రేజ్ సంపాదించి, ఆడియెన్స్ దృష్టికి తనవైపుకు తిప్పుకుంది. ఆ వీడియోలు చూస్తే.. హాలీవుడ్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ వున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. పైగా.. తొలిసారి మహేష్, మురుగ కలిసి పనిచేయడంతో.. ఇందులో బలమైన మేటర్ వుంటుందనే పాజిటివ్ ఫీలింగ్ వుంది. ఇలా.. విపరీతమైన పాజిటివ్‌తో బజ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం, అంచనాలకు అందుకుందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి..
కథ :
శివ (మహేష్‌బాబు) ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఒక గూఢాచారి (స్పై ఆఫీసర్). సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దారుణాలను అణిచివేయడమే అతని లక్ష్యం. ఎక్కడ ఏ ఆపద వచ్చినా.. టెక్నాలజీ సహకారంతో ఆ ప్రదేశానికి చేరుకుని జనాల్ని రక్షిస్తాడు. ఇలా తన పని తాను చేసుకుంటూ పోతుండగా.. ఒకరోజు శివకి మెడికల్ స్టూడెంట్ అయిన రకుల్‌తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది.
కట్ చేస్తే.. సొసైటీలో అనుకోకుండా ఒక్కసారిగా విధ్వంసాలు చోటు చేసుకుంటాయి. ఎక్కడబడితే అక్కడ బ్లాస్ట్‌లు అవుతుంటాయి. అలాగే.. ఓ భయంకరమైన వైరస్ కారణంగా జనాలు చనిపోతుంటారు. ఈ దారుణాలన్నింటికి ఎస్‌జే సూర్య కారణమని తెలుసుకున్న శివ.. అతణ్ణి పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు. అయితే.. సూర్య తన తెలివితో దొరక్కుండా శివ వేసే ప్లాన్స్‌ ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత సూర్య ఏం చేశాడు? అతడ్ని పట్టుకోవడం కోసం అతని చేసిన ప్రయత్నాలేంటి? వాటిని తిప్పికొట్టేందుకు సూర్య వేసిన ఎత్తుగడలు ఏంటి? ఇంతకీ వీరిమధ్య సాగే పోరాటానికి, రకుల్‌కి ఏమైనా సంబంధం ఉందా? అసలు సూర్య ఎందుకు మనుషుల్ని చంపుతుంటాడు? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది.
విశ్లేషణ :
ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు.. దొంగా-పోలీస్ ఆటలాగా హీరో-విలన్ మధ్య సాగే యాక్షన్ థ్రిల్లర్! ఈ థీమ్‌తో ఇదివరకే ఎన్నో చిత్రాలు వచ్చాయి. అయితే.. దర్శకుడు మురుగదాస్ వాటన్నింటికంటే తనదైన శైలిలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. హీరో-విలన్ పోరాటాలకి మధ్య ట్విస్టులు జోడించి.. కథని ఆసక్తికరంగా మలిచాడు. సీన్ టు సీన్ థ్రిల్ చేస్తూ, చివరివరకు కథని మైండ్‌బ్లోయింగ్‌గా నడిపించాడు. ముఖ్యంగా.. హీరో-విలన్ మధ్య సాగే మైండ్‌గేమ్, పోరాట సన్నివేశాల్ని చాలా బాగా తెరకెక్కించాడు. సీన్ టు సీన్ ఏమవుతుందా? అనే ఉత్కంఠ రేపుతూ.. ప్రేక్షకుల్ని సీటుకే అలాగే అతుక్కుపోయేలా చేశాడు. ఓవరాల్ మురుగదాస్.. తన మార్క్ మెసేజ్ మూవీతో మరోసారి ఆడియెన్స్‌ని సంతృప్తి పరిచాడు.
ఫస్టాఫ్ విషయానికొస్తే.. మొదట 15 నిముషాలు హీరో ఇంట్రొడక్షన్, అతని చేసే కొన్ని విన్యాసాలతో నడుస్తుంది. ఆ తర్వాత హీరోయిన్‌ ఎంట్రీ, ఆమెకి-హీరోకి మధ్య రొమాంటిక్ ట్రాక్‌ మామూలే! ప్రీ-ఇంటర్వెల్ వరకు సరదాగా, ఎంటర్టైన్ చేస్తూ సాగే ఈ చిత్రం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. సిటీలో అనుకోకుండా విధ్వంసం చోటు చేసుకోవడం (ట్రైలర్‌లో చూపించే పెద్ద బండరాయి సీన్), విలన్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. అప్పటినుంచే హీరో-విలన్‌కి మధ్య పోరాటం స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మైండ్‌బ్లోయింగ్. ఇక సెకండాఫ్ మొత్తం థ్రిల్లింగ్‌గా సాగుతుంది. హీరో-విలన్ మధ్య నడిచే మైండ్‌గేమ్ అదిరిపోయింది. యాక్షన్ సీన్లైతే కళ్లుచెదిరేలా వున్నాయి. హాలీవుడ్‌కి ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో వున్నాయి. ఒకాదొక దశలో.. మనం హాలీవుడ్ సినిమా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. చివర్లో వచ్చే రోలర్ కోస్టర్ ఫైట్ సీన్ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది.
ఓవరాల్‌గా చూస్తే.. ఇందులో ఆడియెన్స్‌కి కావాల్సిన ఎంగేజింగ్ పాయింట్స్ అన్నీ వున్నాయి. కడుపుబ్బా నవ్వుకోవడానికి అక్కడక్కడ కామెడీ సీన్లు, ఎమోషన్‌ని పండించే ఎపిసోడ్స్, హీరో-హీరోయిన్‌ల రీఫ్రెషింగ్ లవ్ ట్రాక్ అన్నీ బాగానే కుదిరాయి. అక్కడక్కడ కొన్ని సీన్లు సాగదీసినా.. అవేవీ పెద్దగా బోరింగ్‌గా అనిపించవు. మొత్తానికి.. ఈసారి మహేష్ చెప్పినట్లుగానే హిట్ బొమ్మ కొట్టాడు.
నటీనటుల ప్రతిభ : 
గూఢాచారి శివ పాత్రలో మహేష్‌బాబు అదరగొట్టేశాడు. తన హ్యాండ్‌సమ్ లుక్స్‌తో కట్టిపడేస్తూనే.. ‘స్పై’గా చితక్కొట్టేశాడు. ఈ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి.. ఆడియెన్స్‌ని శివగా మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్‌ని కూడా బాగానే పండించాడు. విలన్‌గా ఎస్‌జే సూర్య నటన అమోఘం. బహుశా ఆ క్యారెక్టర్‌కి అతను తప్ప మరెవ్వరూ సూటవ్వరేమో అనేంతగా జీవించేశాడు. రకుల్ ప్రీత్‌కి మంచి పాత్రే దక్కింది. ఈమె పాత్ర అనూహ్య ట్విస్ట్‌తో కూడి వుంటుంది. సినిమాలో అది రివీల్ అయ్యాక.. మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇప్పటివరకు నవ్వించిన ప్రియదర్శి ఇందులో భిన్నమైన రోల్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. మిగతావాళ్లంతా తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక పనితీరు :
సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. తన కెమెరాపనితనంతో గ్రాండ్ విజువల్స్‌తో మనకో హాలీవుడ్ మూవీని చూపించాడు. హరీస్ జయరాజ్ సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్ మాత్రం కుమ్మేశాడు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు ఎక్కడా వంకపెట్టడానికి లేదు. ఇక మురుగదాస్ గురించి మాట్లాడుకుంటే.. అతని ప్రతిభ ఏంటో అందరికీ తెలుసు. ఆయనకు ఇంత క్రేజ్ దక్కడానికి గల కారణం ఏంటో.. ఈ సినిమా చూశాక అర్థం అవుతుంది. మధ్యలో కొన్ని లోపాలున్న.. సినిమాని చాలా బాగా డీల్ చేశాడు. ఈ చిత్రం కేవలం మహేష్‌కే కాదు.. మురుగకి కూడా అతని కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
ఫైనల్ వర్డ్ : ‘స్పైడర్’.. మురుగ మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్

Movie Rating: 3.75/5





Source:Chedugudu.com

thumbnail
About The Author

Ut dignissim aliquet nibh tristique hendrerit. Donec ullamcorper nulla quis metus vulputate id placerat augue eleifend. Aenean venenatis consectetur orci, sit amet ultricies magna sagittis vel. Nulla non diam nisi, ut ultrices massa. Pellentesque sed nisl metus. Praesent a mi vel ante molestie venenatis.

0 comments