తిరునెల్వేలీ: తమిళనాడులో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఘాతుకానికి పాల్పడ్డారు. తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలోని ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ముగ్గురు విద్యార్థులు గురువారం ఉదయం నరికి చంపారు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణపై హాస్టల్‌ను ఖాళీ చేయాలని ప్రిన్సిపాల్ ఆదేశించారు. దాంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఆ కిరాతక చర్యకు పాల్పడ్డారు.
విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన వల్లనాడులోని ఇన్ఫాంట్ జీసస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ సురేష్ (55) ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారు. ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
ర్యాగింగ్, ఇతర క్రమశిక్షణారహితమైన చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఆ ముగ్గురు విద్యార్థులను హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ ఆదేశించినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని పోలీసులు చెప్పారు. ప్రిన్సిపాల్ హత్య నేపథ్యంలో కళాశాలను గురువారం మూసివేశారు. టుటికోరిన్ పోలీసు సూపరింటిండెంట్ దురై సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
0 comments