భారతీయ నెటిజన్ల కళ్లు ఎవరిని ఎక్కువ వెతుకుతున్నాయి? ఎవరి కోసం సెర్చింగ్ ఇంజన్లకు పని తగులుతోంది? ఏ రాజకీయ నాయకులంటే ఇష్టపడుతున్నారు? ఈ విషయాలపై ‘అర్బన్ ఇండియన్ ఓటర్స్’ పేరుతో గూగుల్ ఇండియా నిర్వహించిన సర్వే ఆసక్తిరమైన విషయాలు తేల్చింది. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి ఆదరణ పెరుగుతున్నట్టు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆన్ లైన్ లో మోడీ హవా వీస్తోంది. ఇంటర్నెట్ లో వెతికిన రాజకీయ నాయకుల్లో మోడీదే ఫస్ట్ ప్లేస్.
గూగుల్ లో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో సెర్చ్ చేసిన భారత రాజకీయ నాయకుల్లో మోడీ టాప్ లో నిలిచారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా అనుకుంటున్న రాహుల్ గాంధీ రెండో స్థానంలో నిలిచారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి మూడో స్థానం దక్కింది. ఇక మన్మోహన్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్, జయలలిత, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, సుష్మా స్వరాజ్, దిగ్విజయ్ సింగ్ వరుసగా మోస్ట్ సెర్చెడ్ పొలిటీషియన్ల జాబితాలో ఉన్నారు.
ఇక రాజకీయ పార్టీల విషయానికొస్తే బీజేపీ కోసం నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసినట్టు తేలింది. కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఓటరు గుర్తింపు ఎలా పొందాలనేది అత్యధికులు వెదికిన అంశం. ఎలక్ట్రోరల్ నెంబర్ ఎలా గుర్తించాలి, ఆన్ లైన్ లో ఓటరు గుర్తింపు పొదడం ఎలా, ఓటు ఎలా వేయాలనే దాని గురించి కూడా ఎక్కువ మంది శోధించారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఎన్నికల్లో ఎవరికి ఓటేయ్యాలో పట్టణ ఓటర్లలో 42శాతం మంది ఇంకా నిర్ణయించుకోలేదట. ‘అర్బన్ ఇండియన్ ఓటర్స్’ పేరుతో గూగుల్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. పార్టీని చూసి ఓటేస్తామని 35 శాతం మంది తెలిపారు. స్థానిక అభ్యర్థికే మద్దతిస్తామని 36 మంది పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరనేది చూసి ఓటేస్తామని 11శాతం మంది చెప్పడం విశేషం. పట్టణ యువత ఆన్ లైన్ తో గాఢమైన బంధాన్ని కొనసాగిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని భావిస్తున్నట్టు గూగుల్ ఇండియా సర్వేతో స్పష్టమైంది.
0 comments