2013లో పలువురు సినీ ప్రముఖులు తనువు చాలించారు. వారిలో కొందరు అకాల మరణం చెందారు. గడచిన ఏడాదిలో అత్యంత విషాద ఘటన సినీ నటుడు శ్రీహరి మరణం. కమెడియన్లు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్ 2013లోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. మరికొందరు ప్రముఖులూ సినీ పరిశ్రమకు కన్నీళ్ళే మిగిల్చారు. కొత్త సంవత్సరం వస్తూనే, తెలుగు సినీ పరిశ్రమకు పెను విషాదాన్ని తీసుకొచ్చింది. అదే ఉదయ్‌కిరణ్ బలవన్మరణం. ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త అబద్ధం అయితే ఎంత బావుణ్ణు.?
సినీ తారలంటే సామాన్యుల్లో వున్న అంచనాలే వేరు. ఖరీదైన జీవితం.. అదో గ్లామర్ ప్రపంచం.. తారలంటే దేవుళ్ళకన్నా ఎక్కువ సినీ అభిమానులకి. కానీ, సినీ తారలైనా సరే, మనుషులే కదా. వారికీ మామూలు మనుషుల్లా కష్టాలు తప్పవు. ఆ మాటకొస్తే కష్టాలు వారికి కొంచెం ఎక్కువే. ఎంత కష్టమున్నా మొహానికి రంగేసుకున్నాక, పాత్రల్లో ఒదిగిపోవాల్సిందే. ఆ నటన అనేది సినిమాల్లో అయినా, మామూలు జీవితం గడుపుతున్నప్పుడైనా వారికి తప్పదు. ఎందుకంటే, ఏ క్షణాన అయినా సాధారణంగా కన్పించాల్సి వస్తే, తమ ఇమేజ్ దెబ్బ తింటుందనే భయం వారిది.
తెరపైనా.. తెరవెనుకా.. జీవితాంతం నటించాల్సి వుంటుంది.. అని నటనా రంగంలో వున్న సీనియర్లు చెబుతుంటారు. మేం నటిస్తాం, ఆ నటన వెనుక ఎన్నో కన్నీళ్ళుంటాయి, ఒక్కోసారి దుర్భరమైన జీవనం కూడా వుంటుంది.. అని వాపోతారు. సావిత్రి నుంచి దివ్యభారతిదాకా.. ఎందరో నటీమణులు ప్రేక్షకుల్ని రంజింపజేశారు, తమ జీవితాల్ని బుగ్గిపాల్జేసుకున్నారు. నటీమణులే కాదు, నటులు కూడా ఇందుకు అతీతమేమీ కాదు.
సినీ నటుడు ఉదయ్‌కిరణ్ మృతితో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త దావానలంలా వ్యాపించేసింది, విన్నవారంతా కన్నీరుమున్నీరయ్యారు. యువ నటుడు, ఎంతో భవిష్యత్ వున్న కుర్రాడు అర్థాంతరంగా తనువు చాలించాడంటే, బలవన్మరణానికి పాల్పడ్డాడంటే బాధపడనివారెవరుంటారు? అయ్యో, ఎంత కష్టమొచ్చిందో.. అని వాపోతున్నారంతా. నిజమే ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. అయితే అది ఏ కష్టం? సినీ పరిశ్రమలో ఒకటే కష్టం.. అదే అవకాశాలు రాకపోవడం.
టాలెంట్ వుండీ అవకాశాలు రాకపోవడం, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం అనేది చాలా సాధారణమైన విషయం. కొంతమంది తమ తెలివితేటలతో కష్టాల్ని అధిగమిస్తుంటారు. కొంతమంది కష్టాల నుంచి బయటకు వచ్చే మార్గం తెలీక బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఉదయ్‌కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అంటే పైన చేప కథ చెప్పుకున్నట్టు.. చాలా అనుమానాలు, దేనికీ సమాధానం ప్రస్తుతానికైతే దొరకడంలేదు. ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నదాన్నిబట్టి అవకాశాల్లేక, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి అతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.
కానీ, ఉదయ్‌కిరణ్‌తో బాగా సాన్నిహిత్యం వున్న సినీ ప్రముఖులేమో చాలా ధైర్యంగా వుండేవాడు, కెరీర్‌ని సీరియస్‌గా తీసుకునేవాడుగానీ.. లైఫ్ పట్ల ఎప్పుడూ నిరాశతో వుండేవాడు కాదు.. అని చెబుతున్నారు. చిన్న కారణం చాలు, ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య మహాపాపం.. అని ఎంతమంది చెబుతున్నా, మానసికంగా కుంగిపోయినప్పుడు చిన్న చిన్న కారణాలూ బలవన్మరణానికి దారి తీస్తాయి.
‘చిత్రం’ నుంచి, ‘జై శ్రీరాం’ దాకా ఉదయ్‌కిరణ్ చేసిన సినిమాల్లో కొన్ని ప్రేక్షకుల్ని అలరించాయి, కొన్ని నిరాశపరిచాయి. ఒక్క కమర్షియల్ హిట్ దొరికితే, హీరోగా దూసుకుపోతాడు.. అని ఉదయ్‌కిరణ్ గురించి సినీ పరిశ్రమలో చాలామంది అభిప్రాయపడేవారు. అతనూ అదే ధీమాతో వుండేవాడు. తమిళ సినిమాల్లో నటించాడు కానీ అవీ అతన్ని నిరాశపర్చాయి. రెండు తెలుగు సినిమాలు నిర్మాణంలో వున్నాయి. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ షాక్‌తో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది, ప్రేక్షక లోకం అయితే ఇది నిజమేనా? అన్న ఆశ్చర్యంలో వుందింకా.
కారణం ఏదైనా, ఓ తార నేల రాలింది. రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరనం తెలుగు సినీ పరిశ్రమను ఎంతగా కలచివేసిందో, యంగ్ హీరో ఉదయ్‌కిరణ్ బలవన్మరణం దానికి పది రెట్లు సినీ జనం చేత, సినీ అభిమానుల చేత కంటతడిపెట్టించింది. ఘోరం జరిగిపోయింది.. ఉదయ్‌కిరణ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం, అతన్ని తలచుకుంటూ కన్నీళ్ళు పెట్టడం మినహా ఏం చేయలేం.
0 comments