హైదరాబాద్: డబ్బు, పలుకుబడి సంపాదించిన స్టార్ యాక్టర్లు నిర్మాతలుగా మారడం ఇండస్ట్రీలో కొత్తేమీకాదు. తాజాగా ఆ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరి పోవడానికి ఉవ్విళ్లూరుతున్నారని సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సొంత సినీ నిర్మాణ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఫ్యామిలీ ఇప్పటికే సినీ నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ.....ఆయన మాత్రం కేవలం నటుడిగానే కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈ సారి స్వయంగా తానే నిర్మాణంలో పాలు పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. సొంతగా ప్రొడక్షన్ సంస్థను స్థాపించడం, లేదా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థలో భాగస్వామి కావడం అనే విషయాల గురించి ఆలోచిస్తున్నారట. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.
14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో మహేష్ బాబు ఇప్పటి వరకు 3 సినిమాలు కమిట్ అయ్యారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘ఆగడు' చిత్రం తర్వాత మరో సినిమా కూడా ఆ సంస్థతో కలిసి పని చేయనున్నాడు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్వాహకులైన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలతో మహేష్ బాబుకు మంచి స్నేహం ఉండటం కూడా ఆయన ఈ నిర్ణయానికి రావడానికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో పోటీని తట్టుకోవాలంటే.....కేవలం నటనకే పరిమితం కాకుండా అన్ని విభాగాల్లోనూ పట్టు సాధించాలనే ఆలోచనతోనే మహేష్ బాబు సినీ నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ స్థాపిస్తారా? లేక 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో చేతులు కలుపుతారా? అనేది కాలమే నిర్ణయించాలి.
0 comments