‘తుఫాన్’ రివ్యూ


నటీనటులు- రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, ప్రకాష్ రాజ్, మహి గిల్, శ్రీహరి, తనికెళ్ల భరణి తదితరులు
నేపథ్య సంగీతం- గౌరంగ్ సోని
సంగీతం-మీట్ బ్రోస్ అంజన్, చిరంతన్ భట్, ఆనంద్ రాజ్ ఆనంద్
నిర్మాణం- రిలయన్స్ ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం-అపూర్వ లఖియా


అడవిలాంటి ఓ ప్రాంతంలో హీరోయిన్ కారును గుద్దేసి ఆమె వెంటపడి వస్తుంటారు విలన్లు.. ఆమె పరుగెత్తుకుంటూ రోడ్డు మీదికి రాగానే వెంటనే హీరో కారుతో సహా ప్రత్యక్షమవుతాడు.

హీరో, హీరోయిన్ కార్లో వస్తుంటారు. రోడ్లో ఒకతను యాక్సిడెంటై పడుంటాడు. ఏమైందోనని ఆ పడి ఉన్న వ్యక్తిని తిప్పబోతే చుట్టూ రౌడీలు. ఫైటు..

విలన్ గ్యాంగు అక్రమాల్ని చూసిన అధికారి.. సీక్రెట్ గా దాన్ని రికార్డు చేయకుండా వాళ్ల ముందుకొచ్చి చకచకా ఫొటోలు తీసేస్తుంటాడు. ఏం చేస్తున్నావని అడిగితే మీ అక్రమాల్ని రికార్డు చేస్తున్నా అంటాడు. వెంటనే వాళ్లతణ్ని చంపేస్తారు.

హీరో విలన్ గ్యాంగులో ఒకణ్ని పోలీసు వ్యాన్ లో తీసుకెళ్తుంటాడు. పక్కనున్న పోలీసులతో ఇంతకుముందు తాను ఒకణ్ని ఇలాగే కోర్టుకని చెప్పి తీసుకెళ్తూ ఎలా ఎన్ కౌంటర్ చేసింది చెబుతాడు. వెంటనే అతను భయపడి నిజం చెప్పేస్తాడు.

హీరో చిన్నప్పుడు ఓ విలన్ వచ్చి తల్లిదండ్రుల్ని చంపేస్తాడు. ఆ విలన్ ముఖం కనిపించదు కానీ.. చేతిమీద టాటూ చూస్తాడు హీరో. సరిగ్గా క్లైమాక్స్ లో విలన్ గన్ను తీసి చెయ్యి చాచగానే ఆ టాటూ కనిపిస్తుంది. ఇక ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్.

ఈ సన్నివేశాల గురించి చెబుతుంటే 70లు, 80ల్లో తెలుగు, హిందీ సినిమాలు గుర్తొస్తున్నాయి కదా. మరి ఈ కాలంలో ఇలాంటి సన్నివేశాలతో సినిమా తీస్తే ఏమనాలి? 1973లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘జంజీర్’కు రీమేక్ గా వచ్చిన 2013 తుఫాన్ (హిందీలో జంజీర్) నిండా ఇలాంటి సన్నివేశాలే. జంజీర్ కు రీమేక్ తీస్తూ ఇంతకంటే ఏం చేయగలం అంటే.. మనం చేయగలిగిందేం లేదు. అసలు ఆ సినిమాను రీమేక్ చేయాలని అడిగిందెవ్వరు? ఫర్హాన్ అక్తర్ లా ‘డాన్’ను ఈ కాలానికి తగ్గట్లు మోడర్నైజ్ చేయలేనప్పుడు అలాంటి క్లాసిక్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి కానీ.. వర్మ ‘షోలే’ను చెడగొట్టినట్లు.. లఖియా ‘జంజీర్’ను చెండాడటం దేనికి?

‘తుఫాన్’ సినిమా చూసిన చిరంజీవి ఒక్క మార్పు కూడా చెప్పలేదంట.. ఇది దర్శకుడు అపూర్వ లఖియా మాట. ఒకటో రెండో సన్నివేశాలు మార్చాల్సి వస్తే ఓకే.. మొత్తం సినిమానే మార్చాల్సి వస్తే చిరు మాత్రం ఏం చెప్తాడు పాపం.
ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ పోలీసు అవతరాంలో ఆయిల్ మాఫియా డాన్ ఆటకట్టిస్తే జనాలు జేజేలు పలికారు. ఈ కాలంలో ఏమంత విశేషంగా అనిపించని అదే కథాంశాన్ని తెచ్చి ప్రేక్షకుల నెత్తిన రుద్దితే ఎలా భరించాలి. పోనీ పాత సినిమాలోని ‘ఆత్మ‘నైనా పట్టుకున్నారా అంటే అదీ లేదు. అప్పట్లా పాత్రలు పండలేదు. అప్పట్లా ఎమోషన్ క్యారీ చేయలేదు. అప్పట్లా పాటలు అలరించలేదు. అప్పట్లా నటీనటులు ఆకట్టుకోలేదు. మరి ‘తుఫాన్’ ఎలా మెప్పిస్తుంది?

‘తుఫాన్’ చాలా ప్రత్యేకమైన ఓ సన్నివేశం గురించి చెప్పుకుందాం. ముంబయిలో శివాజీనగర్ అని ఓ ఏరియా ఉంటుందట. అది కొండపై నుంచి ఏటవాలుగా ఉంటుంది. అక్కడ ఉండేది ఆయిల్ మాఫియాకు సహకరించే రౌడీల కుటుంబాలు. అక్కడికి పోలీసులెవ్వరూ వెళ్లలేరు. వెళ్లినా అక్కడి పిల్లలు, పెద్దలు అందరూ కలిసి కట్టుగా దాడి చేసి తరిమి కొడతారు. ఇది తెలిసిన హీరో ఓ కారు తీసుకుంటాడు. కొండ పైకి చేరుకుని కిందికి దూసుకొచ్చేస్తాడు. అక్కడుండే వందల ఇళ్లను కూలగొట్టకుంటూ.. పేల్చుకుంటూ కిందికి వచ్చేస్తాడు. ఒక్క దెబ్బకు మొత్తం వందలాది ఇళ్లను నేలకూల్చేసి అందర్నీ తప్పించుకుని బయటికి వచ్చేస్తాడు. ఇదీ సంగతి. పోలీసుల్ని వెళ్లనివ్వలేదని హీరో ఓ ఏరియాని కూల్చేస్తాడా? అక్కడ పిల్లలు పెద్దలు ఎవరున్నా పర్లేదా? ఇంతా చేస్తే హీరోకు చొక్కా కూడా నలగదా? అతని కారుకు ఏం కాదా? ఇలాంటి అర్థం లేని సన్నివేశాలు ‘తుఫాన్’లో చాలా ఉన్నాయి. షూటౌట్ అట్ లోఖండ్ వాలా, మిషన్ ఇస్తాంబుల్ లాంటి సినిమాలు తీసిన అపూర్వ లఖియాకు ఏం పాడు బుద్ధి పుట్టిందో కానీ.. ‘జంజీర్’ రీమేక్ తో ప్రేక్షకుల్ని ఓ ఆట ఆడుకున్నాడు. కథాకథనాల ప్రస్తావన అక్కర్లేదు. ఫలానా సన్నివేశం అని చెప్పుకోవాల్సిన పనిలేదు.

నటీనటులు ఎవరి స్థాయిలో వారు రెచ్చిపోయారు. తెలుగులో నేర్చుకున్న నటన కూడా మర్చిపోయాడో ఏమో.. రామ్ చరణ్ ఏసీపీ విజయ్ ఖన్నా పాత్రలో తేలిపోయాడు. లఖియా హిందీలో ఇలాగే నటించాలని చెప్పాడో లేక ‘యాంగ్రీ యంగ్ మేన్’ అనిపించుకోవాలంటే ఇలాగే ఉండాలని చెప్పాడో కానీ.. బాడీని బిగబట్టినట్లే ముఖం కూడా బిగదీసి.. సీరియస్ గా చూడటం మినహాయిస్తే రామ్ చరణ్ చేసిందేమీ లేదు. ఇక ప్రియాంక చోప్రా పండించిన భీభత్సం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె నటన, ఆహార్యం, మేకప్ రోత పుట్టించాయి. తెరపై ఆమె కనిపించగానే ‘‘వామ్మో.. మళ్లీ వచ్చిందిరా’’ అని తలలు పట్టుకునే స్థాయిలో హింస పెట్టింది. శ్రీహరికి ఇంకా మగధీర హ్యాంగోవర్ పోయినట్లు లేదు. లేని ఆవేశం తెచ్చుకుని.. ఒత్తి ఒత్తి డైలాగులు పలుకుతుంటే.. చెవులు మూసుకోవాలనిపిస్తుంది. ఇక శ్రీహరికి వేసిన మేకప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫలానా క్యారెక్టర్ చాలా క్రూరమైంది అని చెప్పాలంటే ముఖంలో ఒకట్రెండు గాట్లు పెట్టేవాళ్లు ఒకప్పటి సినిమాల్లో. శ్రీహరి విషయంలో ఇదే ఫాలో అయ్యారు. కానీ గాట్లు ఒక్కో సన్నివేశంలో ఒక్కోలా ఉంటాయి. ప్లేస్ కూడా మారిపోతుంటాయి. అసలు అతను పోషించి షేర్ ఖాన్ పాత్రే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఒక్క సీన్ లో తనను ఫైట్ చేసి ఓడించేయగానే హీరోకు సలాం కొట్టేసి.. అతనికి అండగా నిలవడం సిల్లీగా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య స్నేహాన్ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశం ఒక్కటీ లేదు. కానీ షేర్ ఖాన్ పాత్ర.. ఆసుపత్రిలో ఉన్న విజయ్ ను చూపించి, వాడు నా దేవుడు.. వాడిని కాపాడకుంటే నేను సైతాన్ అయిపోతా అంటూ ఏడ్చేస్తాడు. తనికెళ్ల భరణి పాత్ర కూడా ఇంతే. హీరో వచ్చి రెండు డైలాగులు కొట్టగానే జీహుజూర్ అంటూ అతనికి సలాం చేస్తుంది. విలన్ తో ఆ పాత్ర చెప్పే డైలాగులు చాలా సిల్లీగా ఉంటాయి. ఆ పాత్రను ముగించిన విధానం కూడా చాలా రొటీన్.

నేను సన్నబడుతుంటే నువ్వు లావైపోతున్నావని విలన్ పక్కనుండే వ్యాంప్ క్యారెక్టర్ అంటే.. దానికి ‘‘అందుకే నిన్ను హార్స్ రైడింగ్ నేర్చుకోమంది’’ అన్నది సమాధానం. ఇదొక్కటేనా.. ‘‘మోనా డార్లింగ్.. నువ్వు నోటిని ఆ ఒక్క పనికి మాత్రమే వాడితే చాలు’’.. ఇది ఇంకో ఆణిముత్యం. విలన్ ఈ వ్యాంపు క్యారెక్టర్ అక్కడెక్కడో టచ్ చేస్తూ.. ‘‘మియావ్ మియావ్’’ అంటూ సౌండ్లు… ఇవన్నీ ‘తుఫాన్’ స్థాయిని తెలిపే డైలాగులు, సన్నివేశాలు. ఇప్పటికే తెలుగు సినిమాల్లో బూతులెక్కువైపోతున్నాయని బాధపడుతుంటే.. లఖియా బాలీవుడ్ బూతునంతా తెచ్చి తెలుగు ప్రేక్షకుల మీద పోశాడు. ఐతే కొన్ని చోట్ల బాగా పేలిన డైలాగులు కూడా ఉన్నాయి. సరసమాడుతున్నపుడు విలన్ ని డిస్టర్బ్ చేసిన వాడితో.. ‘‘ఏరా నువ్వింతకుముందు సెన్సార్ బోర్డులో పనిచేసేవాడివా’’.. పిలిస్తే నేనే వచ్చివాడినిగా అన్న విలన్ తో హీరో.. ‘‘నా గదిలో ఏసీ లేదు. నీకు చెమట పడితే అది వేడి వల్ల పట్టిందా.. నేనంటే భయం వల్ల పట్టిందా అనేది తెలియదు’’.. ఇలాంటి కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి.

తన కథాకథనాలతో పెట్టిన హింస చాలదన్నట్లు.. సంగీతంతో హింసించే బాధ్యతను నలుగురికి అప్పగించడాడు లఖియా. నేపథ్య సంగీతానికి ఒకరు.. పాటల కోసం ముగ్గురు సంగీత దర్శకులు.. అందరూ కలిసి ఎంత హింస పెట్టాలో అంతా పెట్టారు. హీరో ఇంట్రడక్షన్ టైంలో రెండు మూడు సన్నివేశాలకు వాడిన రఘుపతి రాఘవ రాజారాం థీమ్ మ్యూజిక్ తోటే బ్యాగ్రౌండ్ స్కోర్ స్థాయి ఏంటో అర్థమైపోతుంది. హీరో నడిచి వెళ్తున్నపుడల్లా బ్యాగ్రౌండ్ లో ఈ మ్యూజిక్ వింటుంటే తలను మందు సీటుకు బాదుకోవాలనిపిస్తుంది. ఇక పాటల సంగతి చెప్పనక్కర్లేదు. ప్రథమార్ధంలో ఉన్న నాలుగు పాటలూ ఐటెం సాంగ్సే. అవి కర్ణ కఠోరంగా ఉన్నాయి. ఉన్న ఐటెం గర్ల్స్ చాలదన్నట్లు ప్రియాంక చోప్రా కూడా తన ఇంట్రడక్షన్ సాంగ్ లో ఐటెం గర్ల్ లాగే కనిపించింది. సినిమాలో చెప్పుకోదగ్గ పాట.. ‘‘ముంబయిలో నేనుంటా..’’ను అత్యంత పేలవంగా ఉపయోగించుకున్నాడు లఖియా. అసలే సినిమా ఎటుపోతోందో అర్థం కాని స్థితిలో ప్రేక్షకులు కొట్టుమిట్టాడుతున్న స్థిలో ఈ పాట పెట్టి వారి సహనాన్ని మరింత పరీక్షించాడు. ఇప్పుడు పాటేంట్రా బాబూ అని బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే.. ఇంకా పాట మధ్యమధ్యలో అర్థం లేని డైలాగులు కూడా. అబ్బో ఈ టార్చర్ ను ఎంత వర్ణించినా తక్కువే.

అయినా రామ్ చరణ్ ముందే హెచ్చరించాడు. …ఒళ్లే హలీమ్ అవుతుంది దేఖో అని! తన సినిమా చూస్తే ఏమవుతుందో అంత స్పష్టంగా చెప్పినా ‘తుఫాన్’ చూడటం ప్రేక్షకుల తప్పు. జనాలు కష్టాల్లో ఉన్నారని నాయకులంతా వరుసగా యాత్రలు చేస్తున్న కాలమిది. కేంద్ర మంత్రి చిరంజీవి కూడా రాష్ట్రవ్యాప్తంగా ‘తుఫాన్’ బాధితుల కోసం ఓ యాత్ర చేపడితే బావుణ్ను.


రేటింగ్- 1/5




thumbnail
About The Author

Ut dignissim aliquet nibh tristique hendrerit. Donec ullamcorper nulla quis metus vulputate id placerat augue eleifend. Aenean venenatis consectetur orci, sit amet ultricies magna sagittis vel. Nulla non diam nisi, ut ultrices massa. Pellentesque sed nisl metus. Praesent a mi vel ante molestie venenatis.

0 comments