హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే సినిమా మొత్తం లీకై తెలుగు సినిమా పరిశ్రమను షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన వెలుగు చూసిన రెండు రోజుల్లోనే పోలీసులు పైరసీకి కారణమైన నిందితులను పట్టుకున్నారు.
అయితే సినిమా లీక్ కావడం వెనక ఇండస్ట్రీలోని కొందరు పెద్దల హస్తం ఉందని, వారిని వదలి పెట్టను, తాట తీస్తాను అంటూ.....థాంక్యూమీటింగులో పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ నీచమైన పనికి పాల్పడింది ఎవరో మాకు తెలుసని, తమ వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సినిమా హిట్టయింది కదా అని... వారిని వదిలి పెట్టను....వారికి తగిన గుణపాఠం చెబుతాను అనే విధంగా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా...తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ ఇచ్చిన వార్నింగుతో సదరు పెద్దలు ఆత్మరక్షణలో పడ్డారని, తమను క్షమించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ వద్దకు కాళ్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొందరు వ్యక్తులతో రాయబారం నడుపుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.
అయితే ‘అత్తారింటికి దారేది' చిత్రం బయటకు లీక్ కావడం వెనక ఉన్న సదరు పెద్దలు ఎవరు? అనేది విషయం మాత్రం బయటకు పొక్కడం లేదు. ఒక వేళ ఆ విషయం బయటకు తెలిస్తే....వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని, అలాంటి చీడపురుగులు పరిశ్రమలో ఉండటం ఎప్పటికైనా చేటే అనే వాదన వినిపిస్తోంది.
సున్నితమైన మంచి మనస్తత్వం, దయాగుణం గల పవన్ వారి క్షమాపణలతో మెత్తబడతారా?.....ఇది క్షమించరాని తప్పు కాబట్టి వారి తాట తీస్తాడా? అనేది కాలమే నిర్ణయించాలి. పెద్దల వ్యవహారం కాబట్టి ఇలాంటి విషయాలు బయటకు పొక్కే అవకాశం లేదు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్.
0 comments