మొత్తానికి బుకాయింపు, దబాయింపులు తిరుగులేని రాజకీయ వ్యూహాలు అని భూమా నాగిరెడ్డి విశ్వసిస్తున్నట్టుగా ఉన్నాడు. ఏకంగా కూతురును కూడా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి భూమా నాగిరెడ్డి తన సత్తా ఏమిటో చెప్పుకున్నాడు. వాళ్ల తాతల, వాళ్ల ముత్తాతల దగ్గర నుంచి అందరి రాజకీయ నేపథ్యం గురించి కూడా వివరించాడు. బ్రిటీష్ కాలంలో తాము ఎంత వైభవంగా బతికామో కూడా చెప్పి జనాల కళ్లు తెరిపించాడు! తను ఎమ్మెల్యేగా గెలిస్తే వైకాపాను మూసేస్తారా? అని.. కూడా భూమా సవాలు విసిరాడు!
మరి ఈ చేతిగాని శౌర్యం ఏమిటనేదే అర్థం కావడం లేదు. ఇక్కడ సమస్య భూమా నాగిరెడ్డి తాత ముత్తాతల గురించి కాదనే అనుకోవాలి. తను గెలిస్తే వైకాపాను మూసేస్తారా? అని సవాల్ విసరడం వరకూ బాగానే ఉంది. కానీ గెలవాలంటే ముందుగా భూమా గారు, వారి కూతురు గారు రాజీనామా చేయాలి! ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించి.. ఎమ్మెల్యే హోదాను అట్టే పెట్టుకున్న ఆయన మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉంది.
తను డబ్బుకు అమ్ముడుపోయే టైపు కాదని చెప్పుకున్న ఈ రెడ్డిగారు.. విలువలు పాటించి ఇలాంటి మాటలు చెబితే పద్ధతిగా ఉంటుంది. వైకాపా ను మూసేస్తారా? అని సవాలు విసురుతున్న ఈయన గానీ, పక్కనూ కూర్చున్న భూమా అఖిల ప్రియ కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు.
వైకాపా ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి.. అప్పుడు సవాల్ విసిరితే అది మగతనం అవుతుంది. అంతే కానీ.. నేను లేస్తే మనిషిని కాదు అంటే, అది కామెడీ అవుతుందని… వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకూ 20 మంది వైకాపా ఎమ్మెల్యేలు ఫిరాయించినట్టే. మరి వారిలో చాలామంది చేసిన పనికి సిగ్గుపడుతున్నట్టుగా మిన్నకుండి పోయారు.
అయితే భూమా నాగిరెడ్డి , జలీల్ ఖాన్, జ్యోతుల నెహ్రూ వంటి వాళ్లు చేతగాని శౌర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దబాయింపు, బుకాయింపుల ద్వారా రోషాన్ని ప్రదర్శిస్తున్నారు. వీళ్ల కామెడీ వీళ్లను సమర్థించే వాళ్లనుకూడా డిఫెన్స్ లోకే పడేస్తోందని అర్థం చేసుకోలేకపోతున్నట్టున్నారు పాపం!
Source:GA
0 comments