హైదరాబాద్: దర్శకుడు రాజమౌళికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన సినిమాలన్నీ విభిన్నంగా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటమే ఇందుకు కారణం. మగధీర, ఈగ లాంటి చిత్రాలతో రాజమౌళి ఇండియన్ ప్రముఖ దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ‘బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు జక్కన్న.
కాగా....తాజాగా వెలుగు చూసిన సంఘటనతో రాజమౌళి పరువు పోయినట్లయిందని అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇందుకు కారణం రాజమౌళి పుత్రరత్నం కార్తికేయనే. ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘బాహుబలి' మేకింగ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మేకింగ్ వీడియో అద్భుతంగా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు...తక్కువ కాలంలోనే 1 మిలియన్ హిట్స్ సొంతం చేసుకుంది.
బాహుబలి మేకింగ్ వీడియో ఇంత బాగా రావడానికి కారణం....తన కొడుకు కార్తికేయ అంటూ రాజమౌళి పలువురికి చెప్పకొచ్చాడు. దీంతో కార్తికేయ తన టీంతో కలిసి అద్భుతమైన పనితనం కనబర్చాడని....రాజమౌళి వారసత్వం పునికి పుచ్చుకున్నాడని అంతా అనుకున్నారు. తాజాగా తేలింది ఏమింటే....బాహుబలి మేకింగ్ వీడియో కార్తికేయ సొంత కాన్సెప్టు కాదని, ఓ హాలీవుడ్ చిత్రం ప్రోమో నుంచి మక్కికి మక్కి కాపీ కొట్టారని రుజువైంది.
‘కామిక్ ఎపిక్' అనే ప్రోమో ఆధారంగా సేమ్ టు సేమ్ కాపీ కొట్టి ‘బాహుబలి' మేకింగ్ వీడియో తయారు చేసాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి అందరికీ తెలిసి పోయింది. కొడుకు కారణంగా రాజమౌళి పరువు పోయినట్లయిందని పలువురు చర్చించుకుంటున్నారు.
0 comments